వానరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ భక్తుడు…– చోద్యం చూస్తూ మానవత్వంను విస్మరించిన ఓ దేవస్థానం అధికారి…–
ఓ ఆర్.ఎం.పి. వైద్య సేవలతో మానవత్వం చాటుకున్న స్థానికులు..
.బి.వి.ఆర్. టుడే న్యూస్,జనవరి 7, గుంతకల్లు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం ఓ వానరం దాడిలో ఓ భక్తుడు తీవ్రంగా గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. సదరు సంఘటనపై స్థానికుల కథనం మేరకు… దేవస్థానం ముఖద్వారం సమీపంలోని విశేష పూజల టికెట్ల విక్రయ కేంద్రం ప్రక్కన శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కుళాయిల వద్ద ఇరు (రెండు) వానరాలు ఘర్షణ పడ్డాయన్నారు. సదరు ఘర్షణలో అటువైపుగా శ్రీవారి దర్శనంకై వెళ్తున్న ఓ భక్తుడుపై ఓ వానరం దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందన్నారు. దీంతో స్థానికులు సదరు వానరంను తరిమి వేసి రక్త గాయాలతో క్షతగాత్రుడైన ఆ భక్తుడిని చేరదీసి గ్రామంలోని ఓ ఆర్ఎంపి వైద్యుడి సహాయంతో వైద్య చికిత్స సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. ఇదిలా ఉండగా సదరు వానరం దాడి సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ భక్తుడి పట్ల స్థానికుల కథనం , బాధితుడి రోదనలు ఏమాత్రం పట్టించుకోకుండా తాను దేవస్థానం ఉద్యోగినన్న కనీస ధర్మం పాటించకుండా మానవత్వంను విస్మరిస్తూ అటువైపు చోద్యం చూస్తూ వెళ్లడం పట్ల స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మానవత్వంను విస్మరించిన దేవస్థానం సదరు ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ వెంకటనారాయణ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన తీరు హేయంగా ఉందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం విశేషం. కాగా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంకు యాత్రికులుగా విచ్చేయు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారి భద్రతల పట్ల దేవస్థానం విధి నిర్వహణ బాధ్యతలలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగాను, అలసత్వం తీరుగా ఉందని స్థానికులు బహిరంగంగా ఆరోపణలు విమర్శలు చేస్తుండడం విచారకరం. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనల పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సదరు దేవస్థానం అధికారులు, సిబ్బంది విధినిర్వహణలో భక్తులకు ఎలాంటి అభద్రతలకు తావివ్వకుండా అసౌకర్యం కలుగకుండా అప్రమత్తతో తగుచర్యలు తీసుకునేలా ఆదేశాల పాటింపుకు చొరవ చూపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని స్థానికంగా భక్తులు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. సదరు ఉద్యోగిని వివరణ కోరగా నాకేం తెలియదంటూ చెప్పారు.