
రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి..
నవంబర్ 26 : బాపట్ల
వెనుకబడిన సామాజిక వర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయాలలో సమానత్వానికి ప్రజాస్వామ్యం సంరక్షణగా నిలిచిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. పిజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్ప మాలలతో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వివిధశాఖల జిల్లా అధికారులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. దేశంలోని భిన్న కులాలు, మతాలు, రాజకీయ అసమానతలను తొలగించి ఐక్యతతో జీవించడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందని కలెక్టర్ చెప్పారు. భారతదేశంలో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిందన్నారు. విదేశీయులకు సైతం స్వేచ్ఛగా మన దేశంలో జీవించటానికి అవకాశాలు ఇచ్చిందన్నారు. హక్కులు ఉల్లంఘన జరిగితే వాటిని సాధించుకునే అవకాశం రాజ్యాంగ కల్పించిందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. దేశానికి ప్రభుత్వ వ్యవస్థ శరీరం లాంటిది అయితే రాజ్యాంగం ఆత్మ లాంటిదని ఆయన వర్ణించారు. అనగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కొరకు ఎస్టి ఎస్సి, బిసి, మహిళా, హిజ్రాలకు కమిషన్ లు సమర్ధంగా పనిచేస్తున్నాయన్నారు. అంటరానితనం నిర్మూలనకు రాజ్యాంగం ఓ గొప్ప ఆయుధంలా నిలిచిందన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన వారిగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అన్నింటిలోనూ రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానికే దక్కిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని భారత దేశం అభివృద్ధి నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. విద్యాతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వివరించారు. రాజ్యాంగం స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎవరైనా ఏ చట్టాలు తెచ్చినా వాటిని కొట్టివేసేలా సుప్రీంకోర్టు వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు. ప్రజలు సుభిక్షంగా జీవించడానికి రాజ్యాంగం అనేక హక్కులు కల్పించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ తెలిపారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం అనేక చట్టాలను రూపొందించిన విషయాలను ఆయన వివరించారు. రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమానంగా ఎదగడానికి రాజ్యాంగం వేదికగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డిఓ పి గ్లోరియా, జిల్లా అధికారులు, ఎస్సీ సంఘం నాయకులు, చారువాక, కలెక్టరేట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.