
తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా సత్తెనపల్లి వాసి…
— ఓ కోర్టులో తల్లి జూనియర్ అసిస్టెంట్.. తనయ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక….
నవంబర్ 29, సత్తెనపల్లి
ఓ కుటుంబంలో తల్లి ప్రధాన జూనియర్ జడ్జి( సివిల్ డివిజన్ ) కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ విధులను నిర్వహిస్తూన్న తీరులో నేడు సివిల్ జడ్జిగా తనయ ఎంపిక కావడం హర్షనీయం. వివరాల మేరకు…సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్.కరిముల్లా, సుజాత గార్ల ఏకైక కుమార్తె షేక్ రోషన్ 2024 లో విడుదల అయిన జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకోవడం, వివిధ దశల్లో జరిగిన పోరాట ఫలితాలలో సఫలీకృతం కావడం అభినందనీయం. ఆమె తండ్రి ఓ ప్రైవేటు ఉద్యోగిగాను,తల్లి సత్తెనపల్లి ప్రధాన జూనియర్ జడ్జి (సివిల్ డివిజన్) కోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న తీరు విశేషం.
షేక్ రోషన్ విద్య సాగించిన తీరులో భాగంగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నెల్లూరు లోను, 6 నుంచి 10 వరకు సత్తెనపల్లి ప్రగతి విద్యాసంస్థల్లో, ఇంటర్ గుంటూరులో,అనంతరం క్లాట్ లో ర్యాంక్ సాధించటంతో విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో 5 సంవత్సరాల వరకు ‘లా’ విద్యను 2023 లో పూర్తి చేశారు. వెంటనే ఏ.పి బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. వెను వెంటనే 2024 లో జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ విడుదల అవ్వటం,తొలినుండే అన్నింటా ప్రథమ ర్యాంక్ సాధించడం ఆమె కృషికి నేడు ఫలితం.తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి గా తనయ ఎంపిక అవ్వటంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్థానికంగా పలువురు న్యాయవాదులు వారిని అభినందించారు.