ప్రస్తుత పరిస్థితుల్లో బాలికల రక్షణకు కరాటే లాటి మార్షల్ ఆర్ట్స్ లో సరైన రక్షణ కవచం..
-తైక్వాండో క్రీడాకారులకు బ్యాగులు, చలి నుండి రక్షణ కోసం మంకీ క్యాప్ లు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
కర్నూలు, డిసెంబర్ 1 .
ప్రస్తుతం ఉన్న సమాజంలో బాలికల రక్షణకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ సరైన రక్షణ కవచమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో తై క్వాండో శిక్షకుడు టి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ బ్యాగులతో పాటు ప్రస్తుతం ఉన్న చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్ లు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో బాలికలపై దాడులు, అత్యాచార ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ,వాటిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో అవసరమని చెప్పారు .బాలికల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను వెంట ఉండి కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పించడం వల్ల వారు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారని చెప్పారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల బాలికలు తమను తాము రక్షించుకోవడంతోపాటు ఆపదలో ఉన్నవారిని సైతం రక్షించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఏ దేశంలో అయితే స్త్రీలు స్వేచ్ఛగా, ధైర్యంగా బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాగలుగుతారో.. అలాంటి దేశాలే అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల క్రమశిక్షణతో పాటు మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందనిజ్ తద్వారా వారు ఎంచుకున్న రంగాల్లో వారు మరింత రాణించగలుగుతారని తెలిపారు. కరాటేలో శిక్షణ పొందడం వల్ల అందులో ధ్యానం ,ప్రాణాయామం, ఏకాగ్రత పొందడంతో పాటు శారీరక వ్యాయామం పెంపొంది ఆరోగ్యకరంగా జీవించగలుగుతారని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా యువత మన దేశంలో ఉందని ,వారిని క్రమశిక్షణ గల పౌరులుగా దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఒకే ఒక ఆయుధం క్రీడలు మాత్రమేనని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలు యువ సంపద కోసం మన దేశం వైపు చూస్తున్నాయని ఆయన వివరించారు. యువతను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదించినప్పుడే మన దేశం ప్రపంచంలోనే అన్ని దేశాలకు నాయకత్వాన్ని వహించే స్థాయికి ఎదుగుతుందని వివరించారు .కర్నూల్ నగరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు సామాజిక సేవా దృక్పథంతో క్రీడలను ప్రోత్సహించేందుకు నిరంతరం తన వంతు సహకారం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో సీనియర్ శిక్షకుడు టీ. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.