నీ హక్కులు తెలుసుకో… నీ జీవితాన్ని మార్చుకో …! -సమస్య మీది.. పరిష్కారం మాది..!
ప్రభాత దర్శిని (తిరుపతి సిటీ ప్రతినిధి):
నిజ జీవితంలో మనిషి అతని హక్కులు తెలుసుకొని సమాజంలో స్వేచ్ఛగా బ్రతకడంతో పాటు తన జీవితాన్ని మార్చుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ చంద్రకళ రెడ్డి తెలిపారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ , ఫౌండర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆదేశాల మేరకు స్థానిక రాయలచెరువు రోడ్డు ఎస్బిఐ కాలనీలో నీ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. మనిషి తన హక్కులు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థిని విద్యార్థులు చిన్ననాటి నుంచే వారి హక్కులను బాధ్యతలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా చిన్నారులు క్రమశిక్షణతో మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలతో పాటు పురుషులు కూడా వారి హక్కులు చట్టాలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దీంతోపాటు వారు తెలుసుకున్న విషయాలను పదిమందికి తెలియజెప్పి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు సర్టిఫికెట్ను ప్రధానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు సభ్యులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.